బీఆర్ఎస్, బీజేపీ కొట్లాట..పబ్లిక్ బోర్ విషయంలో గొడవ..నాచారంలో ఘటన

బీఆర్ఎస్, బీజేపీ కొట్లాట..పబ్లిక్ బోర్ విషయంలో గొడవ..నాచారంలో ఘటన

నాచారం, వెలుగు: నాచారంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సోమవారం రైతు బజార్​లో పబ్లిక్ బోర్ విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. నాచారం కార్పొరేటర్ శాంతి భర్త సాయిజెన్ శేఖర్, బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

దీంతో సాయిజెన్ తో తమకు ప్రాణహాని ఉందని, అసభ్య పదజాలంతో దూషించారని నాచారం పోలీస్ స్టేషన్​లో  గోపాల్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో బోర్ పనులకు ఖర్చు మొత్తం తాము పెట్టుకుంటుంటే గోపాల్ గౌడ్ వచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చి తమతో గొడవకు దిగారని సాయిజెన్ శేఖర్ ఆరోపించారు.

రైతు బజార్​లో జరిగిన తోపులాటలో తనకు గాయాలయ్యాయని, గోపాల్ గౌడ్ ఆయుధంతో దాడి చేశారని ఆయన కూడా ఫిర్యాదు చేశారు.  ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.